Sunday, August 22, 2010

ఆంటీ అమ్మాయి

ఒకసారి ఒక స్నేహితుని (అందులోనో అప్పట్లో ప్రాణస్నేహితుడు ..ఇప్పుడు ఎక్కడ పోయాడో కూడా తెలియదు..life changes కదా ) ఇంటికి వెళ్ళాను.
  వాళ్ళ ఇల్లు అంటే మా ఇంటి లెక్కనే. అంత చనువు. వాళ్ళ పేరెంట్స్ , అక్క అందరికీ నేనంటే చాలా ఇష్టం అభిమానం. నా ఫేసులో ఏం నచ్చిందోకానీ!
   మా ఫ్రెండు తల్లిచాటు బిడ్డ. "అమ్మో అమ్మ తిడుతుంది " అనే రకం. ఈ మాట అనేటప్పటికి వాడు లోకం లెక్కప్రకారం పెళ్ళీడు వచ్చేసినవాడే.
    అలా వాడికి భయం , భక్తీ అయిన వాళ్ళ అమ్మ అంటే నాకూ ఎంతో గౌరవం. పేరుకు ఇంగ్లీషు పదం "ఆంటీ"తో పిల్చినా , ఒక motherly feeling ఎప్పుడూ ఉండేది.
ఇప్పుడు మొదటి లైనులోకెళ్ళ్తే , ఒకరోజు వాళ్ళింటికి వచ్చినప్పుడు కొత్తగా టేబుల్ పై ఉన్న ఒక పాత ఫోటో చూసాను.
   అది "ఆంటీ" కాలేజ్ డేస్‍లో తీసుకున్నది. తన స్నేహితురాళ్ళతో కలిసి. ఇదిగో మా మమ్మీ ఇలా ఉండేది అని మా ఫ్రెండు వాళ్ళ అక్క చూపిస్తుంటే , వెనుక ఏమో ఆంటీ కాఫీ తెస్తూ.
 ఆ క్షణం ....
నా ఎదురుగా ఒక మనిషి మూడు ముక్కలైనట్లు.
ఫోటోలో ఒక బ్యూటిఫుల్ యంగ్ లేడీ . కానీ ఆ మనిషి ఇప్పుడు ఇక్కడ లేదు. లేదా అంటే , ఉంది. శారీరికంగా ఆ ఫోటోలోని అమ్మాయి వెనుక కాఫీ తెస్తున్న ఆంటీనే. కానీ ఖచ్చితంగా మానసికంగా ఆమె ఈమె కాదు అనిపించింది.
  నా పక్కన ఉన్న ఆమె కూతురు ... దాదాపు ఆ ఫోటోలోని మనిషి పోలికలే. ఛాలా భయం వేసింది.
ఈ అమ్మాయి..అదే అక్క.... ఇలానే మానసికంగా నశించబోతోందా అని.
  చచ్చిపోవడం బ్రతకడం వేరు , మారిపోవడం నశించడం వేరు.
మనుష్యులు మారుతారు. కాలాన్ని బట్టి , కష్టాలను బట్టి. కానీ ఆ మార్పులో ఎంత నాశనం ?
 ఫోటోలోని అమ్మాయి.... she was a Queen and still looks like one.
ఆమె సౌందర్యం , ఆ ఆకృతిలో కంటే ఆమెలో తొణికసలాడే ఆత్మవిశ్వాసంలో ఉంది. ఆ రోజుల్లో కాలేజ్ , చేతిలో బుక్స్, ప్రపంచంలో ఏదో సాధిస్తాను అనే పొగరు , కాంక్ష.
 ఈ ఆంటీలో " ఇలా బా..నే..ఉన్నాను" అనే నిర్లిప్తత. తను ఇప్పుడు కూడా నవ్వుతుంది .. కానీ ఆ నవ్వులు వేరే.
   పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతాం . anna karenina లాంటివి. అలాంటి అసంతృప్తులు ఎక్కడో ఉంటారు అనుకుంటాం. కానీ మన ఇంట్లో అమ్మో అక్కో అంతే క్షోభ అనిభవిస్తుండవేమో అని ఆలోచనైనా చేయమే !!
  అమ్మగా ఉండేందుకు , అక్కగా ఉండేందుకా అమ్మాయిలు ?!! అంతేనా ?!
ఈవాల్టి రోజుల్లో కూడా వాళ్ళ నెత్తిన మన కోసం "పవిత్రత" అద్దేసి ఇలా ఉండాలి అనుకోవడానికి నాకేం హక్కుంది ?  నాకే చేతైతే అమాంతంగా ఆంటీను పటేసుకుని ఆ ఫోటోలోకి తోసేసి " ఫో...ఇంకో చాన్స్ ఇస్తున్నా.... నీ లైఫ్ ఇంకెలా ఉంటుందో చూపించు " అందాం అనుకున్నా . కానీ నాకు కాఫీ ఇచ్చాక అంకుల్ కోసం ఏదో వంట చేయడానికి కిచెన్‍లోకి వెళ్ళిపోయింది. 

No comments:

Post a Comment